Showing posts with label Tiruppavai Pasurams. Show all posts
Showing posts with label Tiruppavai Pasurams. Show all posts

Saturday, December 17, 2022

Dhanurmasam Complete Tiruppavai Pasurams


  
  
భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తని ప్రసాదించమని గోదా దేవి ( శ్రీ ఆండాళ్ తల్లి ) ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక.

    శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప, శాంతిసౌఖ్యాలను కోరుకుంటూ, వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ, ముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది.

    పన్నిద్దరాళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం. శ్రీ వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్ణుచిత్తుడనే ఆళ్వారుకి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలదీ శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ, ఆయనను వివాహం చేసుకొంటానని పట్టు పట్టింది.విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమని భావించాడు. కానీ, గోదాదేవి భక్తి ఫలించి, రంగనాథుడు స్వప్నంలో గోదా దేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు.

     సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి, స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం. 

    ఇది ఎనిమిది, తొమ్మిది శతాబ్దుల మధ్య జరిగిన ఉదంతంగా పలువురు పరిశోధకుల అంచనా. మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెలరోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాలే (పాశురాలే) ఈ తిరుప్పావై. 

    తిరు అనేది మంగళ వాచకం. శ్రీకరం, శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని శ్రీ వైష్ణవులు మార్గశీర్ష వ్రతమనీ, ధనుర్మాస వ్రతమనీ అంటారు. 

    గొప్ప శ్రీ వైష్ణవ సాహిత్యమనేగాక, సాహిత్య విలువల దృష్ట్యా సైతం తిరుప్పావై గొప్ప రచన.