తొలి ఏకాదశి
శాన్తాకారం, భుజగ శయనం, పద్మ నాభం, సురేశం |
విశ్వాకారం, గగన సదృశం, మేఘ వర్ణం, శుభాంగం ||
లక్ష్మీ కాంతం, కమల నయనం, యోగి హృద్యాన గమ్యం |
వందే విష్ణుం, భవ భయ హరం, సర్వ లోకైక నాథం ||
ఆషాడ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలిఏకాదశి అంటారు.తొలి ఏకాదశి అంటే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అని. ఈ రోజున ఆ పరమాత్మ అయిన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి జారుకుంటారు. జీవుల కర్మఫలాల గురించి ఆలోచించి, నిద్ర లేవగానే ఎవరి కర్మలను బట్టి వారికి ఏ జన్మను ప్రసాదించాలో నిర్ణయిస్తారు.కాబట్టి మనకు కావలసిన దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తం అన్ని ఎవరికి ఎన్ని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ, మన తప్పుఒప్పులకు లెక్కలు వేయడానికి యోగనిద్రలోకి ఉపక్రమించే రోజు ఈ తొలిఏకాదశి.
ఆషాడే తు సితే పక్షే ఏకదశ్యా ముషోషిత: !
చాతుర్మాస్యవ్రతంకుర్యా ద్యత్కించి న్నియతో నరః !!
వార్షికాం శ్చుతురో మాసా న్వాహ యేత్కేనచి న్నరః !
ప్రవతేన నోచే దాప్నోతి కిల్బిషం వత్సరోద్భవమ్. !!
ఈ రోజున ప్రతి ఒక్కరు పాటించవలసిన నియమాలు:-
❄️ బ్రహ్మీ మూహుర్తంలో నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి.
❄️ దగ్గరలో ఉన్న నదిలో నదీస్నానం ఆచరించాలి.లేదా కనీసం బావి స్నానం అన్నా చేయాలి.
❄️ మనసా, వాచా అన్నింటిని శుద్ధి చేసుకుని, పూజగదిని శుభ్రం చేసుకుని భగవంతుని అలంకరించి శక్తి మేరకు ధూప, దీప, నైవేధ్యాలను, హారతిని సమర్పించి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి.
అయ్యా! ఈ రోజు నేను ఉపవాస వ్రతం చేస్తూ, మౌనవ్రతం చేస్తాను.నీ నామసంకీర్తనం తప్ప నా నోట కానీ, మనస్సులో కాని వేరే అలోచన రానివ్వను అని భగవంతుని ధ్యానంలో కాలం గడపాలి.
❄️ సాయంత్రం దీపారాధన చేసి రాత్రంతా కీర్తనలు చేసి జాగరణ చేసి మర్నాడు ఉదయం ఆరు గంటల లోపు ప్రసాదం స్వీకరించాలి.
ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతవర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః !!
భగవంతుడు యోగనిద్రలో ఉంటారు కదా, మనము చేసే పూజలు ఎవరికి చేరతాయి అనే అనుమానం మీరు పెట్టుకోనక్కరలేదు.
పరమాత్ముడికి ఐదు విభూతులు అని పేరు.
అందులో
🔹మొదటిది వైకుంఠంలో ఉండే ఆ శ్రీమహవిష్ణువుది పర అంటారు.ఈ స్వామి యోగనిద్రలోకి వెళ్ళి మన తప్పుఒప్పులను లెక్కలువేసి మన తదుపరి జన్మను నిర్ణయించేది.
🔹రెండోది క్షీరసాగరంలో వాసుకి మీద శయనించి ఉండే ఆ పరమాత్ముడిది, దీనినే వ్యూహం అంటారు.
🔹మూడోది అవతారాలలో ఉండే స్వామి అంటే రాముడు, కృష్ణుడు..వీరిని విభవము అంటారు.
🔹నాలుగోది, సర్వ జీవుల హృదయాలలో ఉండే స్వామిని అంతర్యామి అంటారు.
🔹ఐదోది మనము రోజు ఇంట్లో పూజించే స్వామి, అర్చ్యామూర్తీ అంటారు.
మనము విన్నవించే విన్నపాలు, మన పూజలు స్వీకరించేది మన ఇంట్లో ఉండే అర్చ్యామూర్తీ.కనుక నిస్సందేహంగా ఆయనను పూజించి మీరు తెలిసితెలియక చేసిన తప్పులకు ఆయనను క్షమించమని మనస్పూర్తిగా వేడుకుని, మంచి జన్మను ప్రసాదించమని వేడుకోండి.
అన్ని ఏకాదశుల్లోకి తొలి ఏకాదశి ఉత్తమోత్తమమైంది. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారు.
ఏకాదశి మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైంది.స్వామి అలంకార ప్రియుడు కనుక మహావిష్ణువుకు జాజిపూలతో అలంకారం చేసి శాంతాకారం భుజగశయనం,పద్మనాభం అంటూ మహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే తొలి ఏకాదశి.
ఆషాఢమాసాన వచ్చిన ఈ ఏకాదశికి ప్రత్యేకత ఉంది ఈ రోజు క్షీరాబ్దిలో మహావిష్ణువు శయనిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయనైకాదశి అని సంభావిస్తారు. స్వామి యోగనిద్రకు ఉపక్రమిస్తాడనే జనులందరూ జనార్దనుని కోసం కటికోపాసం చేస్తారు కనుక నిర్జలైకాదశిని అనీ,హరి దగ్గరే వాసం చేస్తారు కనుక హరివాసరం అని శయనై కాదశిని వ్యవహరిస్తారు. ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు నేటినుంచి దక్షి ణం వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు. కనుక ప్రత్యక్ష నారాయణునిగా తలిచే సూర్యుడు నేటినుంచి పడుకున్నట్లుగా భావించి ఈ ఏకాదశి శయనైకాదశిని పిలవడానికి కారణంగా చెప్తారు.
శయనైకాదశి ఉపవాసవివరాలను భవిష్యోత్తర పురాణం చెబుతుంది. ఏకాదశీవ్రత ప్రాధాన్యం ఏమిటో బ్రహ్మవైవర్తన పురాణం చెప్తుంది. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు.శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని అత్యంత అనురాగంతో కూడిన భక్తితో మహావిష్ణువును శోభాయమానంగా అలంకరించి పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. హరికథలనే చెప్పుకుంటూ హరితో నివాసం చేస్తూ ఉపవాసం చేసిన శ్రీహరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. ప్రతి వైష్ణవాలయంలోను స్వామికి పవళింపుసేవోత్సవం జరుపుతారు.
ఈ పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు. తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుటం ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.
గోముఖ భాగమందు వేదాలు, కొమ్ములందు హరిహరులు, నేత్రాలలో సూర్యచంద్రులు, జిహ్వనందు సరస్వతి, పూర్వభాగములో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి,అరుపులో ప్రజాపతి ఇలా గోదేహమంతా సర్వదేవతలు సర్వతీర్థాలు సర్వదేవతా నివాసస్థానమైన గోవు ను కూడా ఈ ఏకాదశిన పూజిస్తారు.అధర్వణవేదం, బ్రహ్మాండ,పద్మపురాణం, మహాభారతం కూడా గోవిశిష్టత తెలుపుతాయ.
'తొలిఏకాదశి’ రోజున గోశాలను శుభ్రముచేసి అలికి చుట్టూ ముగ్గులు, మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపై ఉంచి, విధివిధానంగా పూజిస్తూ. గంధపుష్పాలతో అర్చించాలి. ఒక్కొక్క పద్మముపై ఒక్కో అప్పడం ఉంచుతారు. ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులు బ్రాహ్మణులకిస్తారు. ఇలా గోమాతను పూజించిన వారికి సకల అభీష్టములు తప్పక తీరుతాయి. ఇలా సంవత్సరం రోజులు చేసి వాయనాలతో దక్షిణతాంబూలాలనిచ్చి వ్రత ఉద్యాపనచేయాలి. మహావిష్ణువుకు అత్యంత ప్రేమపాత్రమైన తులసమ్మ దగ్గర పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి వివిధరకాల పండ్లను నివేదిస్తారు.
ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు,అంబరీషుడు కూడా పాటించారు. వాళ్లు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేత కూడా ఏకాదశివ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశీ వ్రతం చేసేవారి యెడ సదా మహావిష్ణువు తోడునీడగా ఉంటాడు.సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వత్రం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరిపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు.
బంధుమిత్రులందరు కలసి సాయంత్రపుపూట సామూహిక విష్ణుసహస్రనామావళిని పఠిస్తారు. ఈ రోజున పిప్పల వృక్షాన్ని ప్రదక్షిణ చేయడం కూడా మంచిదని అంటారు. చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు నిమ్మపండ్లు, అలసందెలు,ముల్లంగి, గుమ్మడికాయ,చెరకుగడలు వర్జించాలని అంటారు. మహావిష్ణువు నాలుగు నెలలపాటు క్షీర సముద్రంలో శేషశాయి పైన పవళిస్తాడని యతులు సన్యాసులు మహావిష్ణువును కీర్తించడంలో తమ జీవితకాలాన్ని వెచ్చిస్తుంటారు. దేశ సంచారులైన యతులు ఈ నాలుగునెలలూ ఒక్కచోటనే ఉండి విష్ణుకీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు. బౌద్ధుల్లోను చాతుర్మాస వ్రతమున్నట్టు తెలుస్తుంది.
ఆషాఢమాసం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని, తొలి ఏకాదశి పర్వదినంలా జరుపుకుంటారు. తొలి ఏకాదశిని ఆషాఢ ఏకాదశి అని,శయన ఏకాదశి అనికూడా అంటారు. చాతుర్మాస్యవ్రతం ఈ రోజే ఆరంభమౌతుంది. విష్ణుమూర్తిని కొలిచే వైష్ణవులకు తొలి ఏకాదశి ప్రీతికరమైన రోజు. ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాస తొలిఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలి పై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం.
ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.
ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పండితులు అంటున్నారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ,హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించ కూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారం టారు.
ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్య ప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవల సిన పథ్యమేఉపవాసం. 'లంకణం పరమౌషధ' మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం,ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.
ఏకాదశి వ్రతం నియమాలు :-
🔸1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.
🔸2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
🔸3. అసత్య మాడరాదు.
🔸4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.
🔸5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
🔸6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
🔸7. అన్నదానం చేయాలి.
పురాణ కథనాలను అనుసరించి, విష్ణుమూర్తి క్షీర సాగరంలో శేషతల్పం మీద హాయిగా పడుకుని తొలి ఏకాదశినాడు నిద్రకు ఉపక్రమించాడట. అలా పడుకున్న విష్ణుమూర్తి నాలుగు నెలల తర్వాత ప్రబోధినీ ఏకాదశి నాడు మేల్కొన్నాడట. అందుకే ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలు అంటారు.
ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షకాలం ఇది. ఈ కాలం లో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు.
పూర్వం కుంబుడు అనే రాక్షసుడు వాని కుమారుడు మృదుమన్యుడు అచంచలమైన శివభక్తితో అనేక వరములు సంపాదించుకున్నారు. అలాగే స్ర్తి, పురుషులనుండి గాని ఏ ఇతర ప్రాణినుండిగాని తనకు మరణం లేకుండా వరాన్ని కోరుకున్నారు. అయితే మరణం అనేది అనివార్యం కాబట్టి ఆ వరం కుదరదని, ఒక అయోనిజ అయిన స్త్రీ చేత తప్ప ఇంకెవరివల్లను మరణం లేకుండా వరాన్నిచ్చాడు శివుడు. అయోనిజ ఉద్భవించడం ఎలాగూ సాధ్యంకాదు. కాబట్టి ఇక తమకు మరణం లేదన్న గర్వంతో విర్రవీగుతూ సకల జనులను బాధపెట్టసాగారు. వారు చివరకు త్రిమూర్తులను కూడా జయించే పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితిలో త్రిమూర్తులు తమ భార్యలతో పాటు వెళ్ళి ఉసిరిక వృక్షం తొర్రలో దాక్కొనవలసి వచ్చింది. అందరూ ఆ తొర్రలోనే ఇరుక్కున్నందువలన ఆ రాపిడికి ఒక కన్య ఉద్భ వించింది. ఇంతలోనే రాక్షసుడు త్రిమూర్తులను వెతుక్కుంటూ అక్కడకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో తొర్రలోనుండి వచ్చిన కన్య రాక్షసుని సంహరించింది. ఇలా దుష్ట సంహారం చేసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగించింది కాబట్టి మహావిష్ణువుకు ఇష్టురాలయ్యింది. ఆ బాలికే ఏకాదశి అని ప్రతి పక్షంలోను పదకొండవ రోజు ఆమెను స్మరించుకొని శ్రీమన్నారాయణుని పూజిస్తే సకల పాపహరణమని పురాణాలు చెప్తున్నాయి.
మరో కథనం ప్రకారం, కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ఎన్నో వరాలను సంపాదించి ఆ వరగర్వంతో మునులను, దేవతలను హింసిస్తూ చివరకు ఇంద్రుడు, బ్రహ్మలను కూడా వారి స్థానాలనుండి వెళ్ళగొట్టాడు. వారందరి బాధ తీర్చడానికి విష్ణువు మురాసురునితో తలపడ్డాడు. వెయ్యేళ్ళు యుద్ధం చేసినా రాక్షసుని నిర్జించలేకపోయాడు. మహావిష్ణువు చివరకు అలసటతో ‘సింహావధ’ అనే గుహలో విశ్రాంతి తీసు కుంటున్నారు. విష్ణువును వెతుక్కుంటూ వచ్చాడు రాక్షసుడు. ఆ సమయంలో విష్ణువు తన శరీరం నుండి ఒక బాలికను ఉద్భవింప జేసి మురాసురునిపైకి వదిలాడు. ఆ బాలిక రాక్షసునితో యుద్ధం చేసి సంహరించింది. ఆమే ఏకాదశి.
తనకు ఈ విధంగా రాక్షస సంహారంతో సంతోషం కలిగించి నందుకు ఫలితంగా వరం కోరుకొమ్మన్నాడు విష్ణుమూర్తి. దానికా బాలిక ఏకాదశి ‘‘శ్రీమన్నారాయణా! సర్వతిథులలోను నేను ప్రముఖంగా పూజించబడాలి. ఎల్లవేళలా నేను నీకు ప్రియమైనదానిగా ఉండాలి. నా తిథిలో ఉపవాసం ఉండి వ్రతం ఆచరించినవారు మోక్షాన్ని పొందాలి’’ అని అడిగింది. ఆ వరానిచ్చాడు విష్ణువు. ఇలా ఏకాదశి తిథి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్టు భవిష్యపురాణం చెప్తోంది.
ఏకాదశులన్నింటిలోకి అత్యంత ప్రధానమయినది తొలి ఏకాదశికి. అప్పటి నుంచే ‘తొలి ఏకాదశి’ వ్యవహారంలోకి వచ్చిందని మరో పురాణ కథనం.
పురాణగాథ ప్రకారం, యమభటులు తమ దుందుభుల కోసం చర్మం కావాలని కోరారు. చాతుర్మాస్య, గోపద్మ వ్రతాలు ఆచరించనివారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, ద్వారక లోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు. గంగ వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య, స్కంద పురాణాలు తెలియజెబుతున్నాయి.
దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు. ఏకాదశి వ్రతం ఆచరించి, నియమ నిష్ఠలతో ఉపవసించి, విష్ణు సాయుజ్యం పొందాడంటారు. దుర్భర దారిద్య్రంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు. అందువల్ల అతడు సిరిసంపదలు, సకలసౌఖ్యాలు అనుభవించగలిగాడంటారు. రుక్మాంగదుడు స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే, రాజ్యంలోని ప్రజలందరితోనూ చేయించాలని సంకల్పించాడు. దీని వల్ల యమలోకానికి చేరే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో- వ్రతభంగం చేసి రమ్మని యముడు రంభను పంపాడు. ఆమె మోహిని రూపంలో వెళ్లి రుక్మాంగదుణ్ని ఆకర్షించింది. అదే పుణ్యదినాన అతణ్ని కోరిన రంభను, మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు. ‘నీ పుత్రుణ్ని వధించు’ అని రంభ పరీక్షపెడితే, అందుకు సిద్ధపడ్డాడట. విష్ణువు ప్రత్యక్షమై, రుక్మాంగదుడి వ్రతదీక్షను ప్రశంసించి, మోక్షం ప్రసాదించాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
తెలుగువారి తొలి పండుగగానూ గుర్తింపు పొందిన తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే జన్మ జన్మల పాపం పోతుంది.
No comments :
Post a Comment