మణిద్వీప వర్ణన శ్రీ లలిత పరమేశ్వరి దేవి నివాసం యొక్క వర్ణన. ఈ మణిద్వీపం మన హృదయంలో తప్ప మరెక్కడా లేదు. దురాశ, అసూయ, స్వార్థం వంటి బాహ్య కాలుష్య కారకాల నుండి మాత్రమే మనల్ని మనం కాపాడుకోగలిగితే, మనలోని మణిద్వీపమును కనుగొనవచ్చు.
మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయింది || 1 ||
సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు || 2 ||
లక్షల లక్షల లావణ్యాలు అక్షరలక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు || 3 ||
పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలౌ
గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు || 4 ||
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం || 5 ||
పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు
మధురమధురమగు చందనసుధలు మణిద్వీపానికి మహానిధులు || 6 ||
అరువదినాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు || 7 ||
అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలౌ మణిద్వీపానికి మహానిధులు || 8 ||
కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు
కోటితారకల వెలుగుజిలుగులు మణిద్వీపానికి మహానిధులు || 9 ||
కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు || 10 ||
పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు || 11 ||
ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు
పుష్యరాగ మణిప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు || 12 ||
సప్తకోటి ఘనమంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు ..భువ... || 13 ||
మిలమిలలాడే రత్నపు రాసులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు || 14 ||
కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు || 15 ||
భక్తిజ్ఞానవైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు || 16 ||
కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు || 17 ||
మంత్రిణి దండిణి శక్తిసేనలు కాళి కరాళి సేనాపతులు
ముప్పదిరెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 18 ||
సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు || 19 ||
సప్తసముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు || 20 ||
మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయా కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు || 21 ||
.కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు
పదారురేకల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 22 ||
దివ్యఫలముల దివ్యాస్త్రములు దివ్యపురుషులు ధీరమాతలు
దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 23 ||
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంతభవనములు
మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు || 24 ||
పంచభూతములు యాజమాన్యాలు వ్యాళసాలం అనేకశక్తులు
సంతాన వృక్షసముదాయాలు మణిద్వీపానికి మహానిధులు || 25 ||
చింతామణులు నవరాత్రులు నూరామడల వజ్రరాసులు
వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు || 26 ||
దుఃఖము తెలియని దేవీసేవలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు || 27 ||
పదునాల్గు , లోకాలన్నిటిపైనా సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్థానం || 28 ||
చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో || 29 ||
మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో || 30 ||
పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది....2... || 31 ||
నూతనగృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు ....2... || 32 ||
శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట
తిష్టవేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలను సమకూర్చుకొనుటకై || 33 ||
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం... || 34 ||
మణిద్వీపవర్ణన నకు అర్ధం ::::
1) మణిద్వీపం బ్రహ్మ లోకానికి పైన ఉంటుంది. దీనిని సర్వ లోకమంటారు. మణిద్వీపం, కైలాసం,వైకుంఠం, గోలోకం, కంటే శ్రేష్టం గా విరాజిల్లుతుంది.
2) మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రం విస్తరించి ఉంటుంది . ఆ సముద్రంలో శీతలమైన తరంగాలు, రత్నాల తో కూడిన ప్రదేశాలు ఉంటాయి, అనేక వర్ణాలు కలిగిన శంఖాలు, జలచరాలు, కన్నులకు విందు చేస్తుంటాయి.
3) ఆ ప్రదేశానికి బయట 7 యోజనాలు వైశాల్యం గల లోహం తో కూడిన ప్రకారం (గోడ) ఉంటుంది . అనేక రకాలైన అస్త్ర, శస్త్రాలు, ధరించి ఉన్నభటులు ఉంటారు, వారు మణిద్వీపాన్ని నిరంతరం కాపలా కాస్తుంటారు. ప్రతి ద్వారం వద్ద వందలాది మంది భటులు ఉంటారు .
4) మణిద్వీపం లో అమ్మవారిని నిత్యం ఆరాధించే భక్తులు అనేక మంది ఉంటారు. ప్రతీ అడుగు అడుగుకి స్వచ్ఛమైన మధురమైన నీరు ఉండే సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి, అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహా ప్రాకారం ఉంటుంది.
5) సమస్త వృక్ష జాతులు ఇక్కడ ఉంటాయి . అనేక వందల సంఖ్యలో దిగుడు బావులు, నదీ తీరాలు, కన్నులకు పండుగ చేస్తుంటాయి, అనేక జాతుల పక్షులు వృక్షాలపై ఆనందం గా ఎగురుతూ ఉంటాయి.
6) ఈ ప్రాకారం దాటిన తరువాత తామ్ర ప్రాకారం ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు రంగుతో ఉంటాయి. రక రకాలైన పండ్ల చెట్లు రత్నాలవలె ఉంటాయి, సువాసనలు వెదజల్లుతుంటాయి .
7) తామ్ర ప్రాకారం దాటి వెళ్లగా సీస ప్రాకారం ఉంటుంది, సీస ప్రాకారం మధ్య భాగం లో సంతాన వాటిక ఉంది, అక్కడ అనేక రకాలైన ఫల- వృక్షాలు ఉంటయి .అక్కడ లెక్క లేనన్ని అమర సిద్ద గణాలు ఉంటాయి.
8) సీస ప్రాకారం దాటి వెళ్లగా ఇత్తడి ప్రాకారాల మధ్య బాగం లో హరి చందాన తరువనాలు ఉంటాయి. అక్కడి ప్రదేశమంతా నవ పల్లవ తరు పంక్తులతో లేలేత తీగలతో , పచ్చని పైరులతో కనుల విందుగా ఉంటుంది. అక్కడి నదులు చాల వేగంగా ప్రవహిస్తుంటాయి.
9) ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచ లోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచ లోహాల ప్రాకారాల మధ్యలో మందార వనములు, చక్కని పుష్పాలతో నయానందకరం గా ఉంటుంది . అక్కడ పారిజాత పుష్పాలు సుగంధాలు వెదజల్లుతుంటాయి.
10) ఆ ప్రాకారం దాటి వెళ్లగా సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతూ కనిపిస్తుంది. రజిత, సువర్ణమయ. ప్రాకారాల మధ్య కదంబ వనం ఉంటుంది . ఆ చెట్ల నుండి కదంబ మద్యం ధారగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మద్యం సేవనం వల్ల ఆత్మానందం కలుగు తుంది .
11) సువర్ణ మాయ ప్రాకారాన్ని దాటి వెళ్లగా ఎర్రటి కుంకుమ వర్ణం కలిగిన పుష్యరాగమణి ఉంటుంది. సువర్ణమయ, పుష్య రాగాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు, అన్ని రత్నమయమై ఉంటాయి.
12) ఇక్కడ ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ఉంటారు. దానికి తూర్పుగా అమరావతి నగరం నానావిధ వనములతో భాసిల్లుతూ ఉంటుంది.
13) అక్కడ మహేంద్రుడు వజ్ర హస్తుడై దేవ సేన తో కలిసి ఉంటాడు. దానికి ఆగ్నేయ భాగం లో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగం లో యముని నగరం సమ్యమిని ఉంది. నైరుతి దిశలో కృష్ణగన నగరం లో రాక్షసులు ఉంటారు .
14) పశ్చిమ దిశలో వరుణ దేవులు శ్రద్ధావతి పట్టణం లో పాశం ధరించి ఉంటాడు. వాయవ్య దిశలో గంధవతి లో వాయుదేవుడు నివసిస్తూ ఉంటాడు.
15) ఉత్తర దిశలో కుబేరుడు తన యక్ష సేనలతో, అల్కాపురి లో విశేషమైన సంపదలతో తేజరిల్లుతూ ఉంటాడు. ఈశాన్యం లో మహారుద్రుడు అనేక మంది రుద్రులతోను ,మాత ల తోను. వీరభద్రాదులతోను, యశోవతి తోను భాసిల్లుతూ ఉంటాడు .
16) పుష్యరాగమణుల ప్రాకారం దాటి వెళ్లగా అరుణ వర్ణం తో పద్మరాగమణి ప్రాకారం ఉంటుంది . దానికి గోపుర ద్వారాలు అసంఖ్యాకంగా ఉండి మండపాలు ఉన్నాయి . వాటి మధ్యలో మహావీరులు, చాతుర్వసృష్టి కళలు కలిగి ఉంటారు. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి . అనేక వందల సైనాలు ఉన్నాయి, రధ , అశ్వాలు ,శస్త్రాలు లేక్కకు మించి ఉన్నాయి .
17) ఆ ప్రాకారాన్ని దాటి వెళ్లగా గో మేధిక మణి ప్రాకారం ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడి భవనాలు గోమేధిక మణి కాంతులు విరజిమ్ముతూ ఉంటాయి.
18) అక్కడ 32 శ్రీ దేవి శక్తులు ఉంటాయి . 32 లోకాలు ఉన్నాయి . ఆ లోకం లో నివసించే శక్తులు పిశాచవదనాలతో ఉంటాయి . వారందరు శ్రీ అమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సర్వ సన్నద్ధులై ఉంటారు
19) గోమేధికా ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీ త్రిభువనేశ్వరి దేవి దాసదాసీ జనం తో నివసిస్తూ ఉంటారు .
20) వజ్రాల ప్రాకారం దాటి వెళ్లగా వైడూర్యాలు ప్రాకారం ఉంటుంది. అక్కడ 8 దిక్కులలో బ్రాహ్మి, మహేశ్వరీ,కౌమారి, వైష్ణవి,వారాహి, ఇంద్రాణి, చాముండి, అనువారలు సప్త మాతృకలుగా ప్రసిద్ధి చెందారు . శ్రీ మహాలక్ష్మి దేవి అష్టమ మాతృక గా పిలవబడుతున్నారు.
21) ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్లగా ఇంద్ర నీలమణి ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి . ఇవి ప్రపంచం లోని వార్తలనన్నిటిని తెలియచేస్తుంటాయి.
22) ఇంకా ముందుకు వెళ్లగా , మరకతమణి ప్రాకారం ఉంటుంది . అక్కడ తూర్పు కోణం లో గాయత్రీ, బ్రహ్మదేవుడు, ఉంటారు.
23) నైరుతి కోణం లో మహారుద్రుడు, శ్రీ గౌరీ విరాజిల్లుతును ఉంటారు. వాయువ్యాగ్ని కోణం లో ధనమతి కుబేరుడు ప్రకాశిస్తుంటారు. పశ్చిమ కోణం లో మన్మధుడు రతీ దేవి తో విలసిల్లుతుంటారు.
24) ఈశాన్య కోణం లో విఘ్నేశ్వరుడు ఉంటారు వీరందరూ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు . ఇంకా ముందు వెళ్లగా పగడాల ప్రాకారం ఉంటుంది . అక్కడ పంచ భూతాల స్వామినిలు ఉంటారు.
25) పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్లగా నవరత్న ప్రాకారం ఉంటుంది . అక్కడ శ్రీ దేవి యొక్క మహా అవతారాలు, పాశాంకురేశ్వరి , భువనేశ్వరి, భైరవి , కాపల భైరవి. క్రోధ భువనేశ్వరి, త్రిపుర,అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళీ,తార, షోడశి,భైరవి, మాతంగి మొదలైన దశ మహా విద్యలు ప్రకాశిస్తుంటాయి .
26) నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే , మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది. చింతామణి గృహానికి వేయి స్తంభాలు, శృంగార, ముక్తి ,జ్ఞాన ,ఏకాంత అనే నాలుగు (4) మండపాలు ఉంటాయి . అనేక మణి వేదికలు ఉన్నాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది.
27) ఆ మండపాలికి 4 దిక్కులా కాశ్మీర వనాలు కనులకింపుగా ఉంటాయి. మల్లె పువ్వుల తోటలు, కుంద, పుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనలు ఉంటాయి . అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపజేస్తాయి.
28) అక్కడ గల మహా పద్మాల నుండి అమృత ప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూ ఉంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్య గీతాలను ఆలపిస్తుంటాయి. సభా సదులైన అమరులు మధ్య శ్రీ లలితా దేవి సింహాసన ఆసీనురాలై ఉంటుంది.
29) శ్రీ దేవి ముక్తి మండపం లో నుండి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. జ్ఞాన మండపం లో నుండి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏకాంత మండపం లో తన మంత్రిణులతో కొలువై ఉంటుంది. విశ్వ రక్షణ గురించి చర్చిస్తుంటుంది.
30) చింతామణి గృహం లో శక్తి తత్వాత్మికాలైన పది సోపానాలతో దివ్య ప్రభలను వెదజల్లుతూ ఒక మంచము ఉంటుంది . బ్రహ్మ , విష్ణు, రుద్ర, ఈశ్వరులు, దానికి నాలుగు(4 )కోళ్ళుగా ఉంటారు. ఆ నాలుగు కోళ్లపై ఫలకం గా సదాశివుడు ఉంటాడు . దానిపై కోటి సూర్య ప్రభలతో, కోటి చంద్ర శీతలత్వం తో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీ అమ్మవారు ఆశీనులై ఉంటారు.
31) శ్రీ లలిత దేవి ఙ్ఞా న మనే అగ్ని గుండం నుండి పుట్టినది . నాలుగు బాహువులు కలిగి, అనురాగమను పాశము, క్రోధమనే అంకుశము, మనస్సు విల్లుగా, స్పర్శ , శబ్ద,రూప, రస, గంధాలను (పంచతన్మాత్రాలను) భాణాలుగా కలిగి ఉంటుంది . బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతి తో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ, మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది.
32) కురువిందమణులచే ప్రకాశించబడుతున్న కిరీటముచే అలకరించబడినది. అమ్మవారి నుదురు అష్టమి నటి చంద్రుని వలె ప్రకాశించుతుంటుంది. చంద్రుని లోని మచ్చ వలె ఆమె ముఖము పై కస్తూరి తిలకం దిద్దుకొని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహమునకు అలంకరించిన మంగళ తోరణముల వలె ఉన్నవి.
33) ప్రవాహమునకు కదులుచున్న చేపల వంటి కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుడక, కడిమి పూల గుత్తి చే అలంకరించ బడిన మనోహరమైన చెవులకు సూర్య చంద్రులు కర్ణాభరణములు గా కలిగి ఉన్నది. పద్మరాగమణి కెంపు తో చేయబడిన అద్దము కంటే అందమైన ఎర్రని చెక్కిళ్ళతో ప్రకాశించు చున్నది. రక్త పగడమును, దొండ పండును మించిన అందమైన ఎర్రని పెదవులు, షోడశీ మంత్రము నందలి పదునారు భీజాక్షరముల జత వంటి తెల్లని పలువరసలు కలిగి ఉన్నది
34) శ్రీ మాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కుల వెదజలుతుంటాయి. ఆమె పలుకులు సరస్వతీ దేవి వీణా నాదమును మించి ఉంటుంది. అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేదీ లేదు. కామేశ్వరుని చే కట్టబడిన మంగళ సూత్రముతో అమ్మ కంఠము శోభిల్లుతూటుంది.
35) ఆమె భుజములు బంగారు భుజ కీర్తుల తోను దండ కడియములు, వంకీలతోను అందముగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణములు, ముత్యాల జాలరులు కలిగిన చింతాకు పతకము ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది.
36) ఆమె కాలిగోళ్ళ కాంతి భక్తుల అజ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాలకంటే మృదువైన పాదాలు కలిగి ఆమె ఉంటుంది. సంపూర్ణమైన అరుణ వర్ణం తో ప్రకాశిస్తూ శివ కామేశ్వరుని ఒడిలో ఆసీనురాలై ఉంటుంది .
పఠనా ఫలితం ::::
పదునాలుగు లోకాలకు పరంజ్యోతి యగు మణిద్వీపనివాసిని , పరమేశ్వరుని 9 విధాలుగా కీర్తించుకొనుటకు 9 పద్యాలతో ఈ స్త్రోత్రం వ్రాయుట జరిగినది.
అమ్మవారు కు నవ(9 ) సంఖ్య ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాయములు ప్రతి రోజు చదివిన ప్రతి మనిషి శుభాలు పొందవచ్చును.
దీనిని శుక్రవారం, మీ పూజానన్తరం 9 మార్లు పారాయణం చేసిన లేదా గానం చేసిన ధన, కనక , వాస్తు,వాహనాలు , సంపదలు కలిగిభక్తి, జ్ఞాన,వైరాగ్య, సిద్దులు కలిగి ఆయురారోగ్యాలు ,ఐశ్వర్యాలతో తుల తూగెదరు.
చివరకి మణిద్వీపాన్ని చేరగలరు . ఇది శాస్త్రం చెప్పిన సత్యం ..
జ్ఞానోదయం::::
మణిద్వీప వర్ణన జపించడం లేదా వినడం మీ చుట్టూ ఉన్న ప్రతికూలతను తొలగిస్తుంది మరియు లోపలి ప్రయాణం చేయడానికి మీకు సహాయ పడు తుంది.
తల్లీ , నేను మీ హృదయంలో కూర్చున్నప్పుడు, మీరు నన్ను ఎందుకు బయట వెతుకుతారు. మీరు నన్ను ఎప్పుడూ బయటి ప్రపంచంలో కనుగొనలేరు.
Visit the following Links for Manidweepa Varnana
No comments :
Post a Comment